ఆస్తి పన్ను @ 56.55 శాతం
అమరచింత: జిల్లాలోని ఐదు పురపాలికల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను వసూలు సోమవారం రాత్రి వరకు కొనసాగింది. పుర అధికారులు కొంతకాలంగా పన్ను వసూళ్లలో వేగం పెంచడంతో చివరి రోజు వరకు 56.55 శాతానికి చేరింది. గత నెలలో వడ్డీపై 90 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించడంతో వారం రోజులుగా పన్ను వసూళ్లను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. జిల్లాలోని ఐదు పురపాలికల్లో పన్ను వసూలు లక్ష్యం రూ.16.62 కోట్లు కాగా.. 90 శాతం వడ్డీ రాయితీతో రూ.16.41 కోట్లకు చేరింది. చివరి రోజు వరకు ఇచ్చిన లక్ష్యంలో రూ.9.28 కోట్లు వసూలు చేయగలిగారు.
ప్రత్యేక బృందాలుగా..
పన్ను వసూళ్లు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు పుర అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగారు. పండుగ రోజుల్లో సైతం కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇల్లిల్లూ తిరిగి వసూలు చేశారు. ఉదయం ఆరు వరకే సిబ్బంది వార్డుల్లోకి చేరుకొని ఇంటి పన్ను వసూళ్లు చేపట్టారు. మొదట్లో కాస్త నెమ్మదించినా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో వేగం పెంచినా లక్ష్యంలో సగానికే చేరుకోగలిగారు.
పురపాలికల వారీగా వసూళ్లు ఇలా
(రూ.కోట్లలో..)
పురపాలిక లక్ష్యం వసూలు శాతం
వనపర్తి 10.94 5.55 50.73
ఆత్మకూర్ 2.39 1.44 60.25
కొత్తకోట 1.60 1.06 66.25
పెబ్బేరు 0.93 0.83 89.25
అమరచింత 0.55 0.40 72.73
జిల్లా లక్ష్యం రూ.16.62 కోట్లు..
వసూలైంది రూ.9.28 కోట్లు


