సమష్టి కృషితోనే మత్తు పదార్థాల నియంత్రణ
వనపర్తి: యువత, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని.. సమష్టి కృషితోనే డ్రగ్స్‌ను నియంత్రించవచ్చని నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ బుచ్చయ్య అన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో రూపొందించిన ‘గంజాయి, కల్తీ కల్లు నిర్మూలన’ వాల్‌పోస్టర్‌ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలో గంజాయి, కల్తీ కల్లుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. మత్తు పదార్థాలు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికపరంగా తీవ్ర ప్రభావం చూపుతాయని.. ఎవరైనా గంజాయి, కల్తీ కల్లు తయారీ, సరఫరా, వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. మత్తు వ్యసనాన్ని నిర్మూలించేందుకు అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జగన్, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.


