పేదలకు నాణ్యమైన సన్నబియ్యం
వనపర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తోందని.. సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. గురువారం శ్రీరంగాపూర్‌లోని రెండోనంబర్ రేషన్ దుకాణాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి సందర్శించి రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం దుకాణంలోని స్టాక్ రిజిస్టర్, బియ్యం పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఇక నుంచి ప్రతి నెల సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
చెరువు పరిశీలన..
మండలంలోని జానంపేట రామసముద్రం చెరువు నీటిలో తమ భూములు ముంపునకు గురవుతున్నాయని.. నష్టపరిహారం చెల్లించాలంటూ ఆయకట్టు రైతులు ఇదివరకు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్, ఇరిగేషన్ సూపరింంటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్, ఆర్డీఓ చెరువు పరిసరాలను పరిశీలించారు. అక్కడికి వచ్చిన గ్రామ రైతులు, పిటిషన్‌దారులతో కలెక్టర్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాత పూర్తి నివేదికను లోకాయుక్తకు సమర్పిస్తామని చెప్పారు. కలెక్టర్ వెంట సి–సెక్షన్ సూపరింటెండెంట్ కిషన్, శ్రీరంగాపూర్ డిప్యూటీ తహసీల్దార్ అనురాధ ఉన్నారు.


