రైతుల మేలుకే కొత్త భూ చట్టం
ఖిల్లాఘనపురం: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రైతులకు మేలు చేకూరనుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పర్వతాపురం గ్రామం రైతువేధికలో భూ భారతి చట్టం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నాయకులు, అధికారులు, రైతులతో కలిసి తిలకించారు. అలాగే పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో ఎంతోమంది రైతుల మధ్య గొడవలు జరిగాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధరణికి బదులుగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. త్వరలోనే అన్ని మండలాల్లో ఈ చట్టం అమలులోకి వస్తుందని చెప్పారు. గ్రామాల్లో సింగిల్‌విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
‘నిరంతర
పోరాట స్ఫూర్తి జార్జిరెడ్డి’
వనపర్తి విద్యావిభాగం: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అణు భౌతికశాస్త్రంలో బంగారు పతకం సాధించిన గొప్ప మేధావి, నిరంతర పోరాట స్ఫూర్తినిచ్చిన వ్యక్తి జార్జిరెడ్డి అని పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్ కొనియాడారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పీడీఎస్‌యూ కార్యాలయంలో నిర్వహించిన జార్జిరెడ్డి వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాట యోధుడు చెగువెరా స్ఫూర్తితో జార్జిరెడ్డి తన మిత్రులతో కలిసి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాన్ని స్థాపించారన్నారు. అనతికాలంలోనే విద్యార్థుల ఆదరణ పొంది ఎదురులేని శక్తిగా పీడీఎస్‌యూ నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి సాయికృష్ణ, ప్రవీణ్, బీచుపల్లి, గోపి, నిఖిల్, శికామణి, నవనీత, కిరణ్, మౌనిక, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
‘భూ భారతి’కి పైలెట్ ప్రాజెక్టుగా ‘మద్దూరు’
నారాయణపేట: వ్యవసాయ భూములకు సంబందించి సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం ఈ పోర్టల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించగా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో సీఎం ఇలాఖా అయిన కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద మద్దూరుమండలాన్ని ఎంపిక చేయడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్‌షాలం సూచనలతో తహసీల్దార్ మహేశ్‌గౌడ్, అధికార యంత్రాంగం భూభారతిని క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నుంచి మండలంలో క్షేతస్థాయిలో రైతులకు, ప్రజలకు ముందుగా భూ భారతిపై అవగాహన కల్పించనున్నారు. ప్రజల నుంచి వచ్చే సందేహాలు, సలహాలు, సూచనలు స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు.
రెవెన్యూ గ్రామాలు 17..
భూమి 30,621 ఎకరాలు
మద్దూరు మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. చెన్వార్, చెన్నారెడ్డిపల్లి, చింతల్‌దిన్నె దమ్‌గన్‌పూర్ దొరెపల్లి, జాదరావ్‌పల్లి, ఖాజీపూర్, లక్కాయపల్లి, మద్దూర్, మల్కిజాదవ్‌రావ్‌పల్లి, మొమినాపూర్, నాగిరెడ్డిపల్లి, నందిపహడ్, పల్లెర్ల, పర్సపూర్, పెదరిపాడు, రేనివట్ల గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం మండల వ్యాప్తంగా 30,621 ఎకరాల భూమి ఉంది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండగా ఒక ఆర్‌ఐ, ఒకరు సర్వేయర్ విధుల్లో ఉన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన మద్దూర్ మండలానికి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ రెవెన్యూ, సర్వేయర్లను నియమించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
రైతుల మేలుకే కొత్త భూ చట్టం


