టన్నెల్ లీకేజీల గుర్తింపునకు ట్రయల్ రన్
ధర్మసాగర్: దేవాదుల పథకంలో భాగంగా చేపట్టిన 3వ ప్యాకేజీ ద్వారా హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట పంప్‌హౌస్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి గత నెల 27న పంపింగ్ ప్రారంభించగా నాలుగు రోజుల క్రితం టన్నెల్ లీకైన విషయం తెలిసిందే. పంపులు బంద్ చేసి డీ వాటరింగ్ చేసి చూడగా ఎక్కడా లీకేజీ కనిపించలేదు. దీంతో గురువారం మళ్లీ పంప్‌లు ట్రయల్ రన్ చేయగా.. సీపేజీ ద్వారా అక్కడక్కడా చిన్న చిన్న లీకేజీలు కనిపిస్తున్నాయే తప్ప ఎక్కడా పెద్ద లీకేజీ ఉన్నట్టు గుర్తించలేదు. ఇంతకుముందు లీకేజీ అయిన వద్ద నుంచి కాకుండా రిజర్వాయర్‌లోకి పంపింగ్ జరుగుతున్న దగ్గర డీ వాటరింగ్ చేసి టన్నెల్‌లోకి దిగి చూస్తే తప్ప లీకేజీని గుర్తించలేమని అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ డీ వాటరింగ్ పూర్తి చేసి శుక్రవారం టన్నెల్‌లోకి దిగే పనులు ప్రారంభించారు.


