మొక్కజొన్న పంట దగ్ధం
నల్లబెల్లి: మండల కేంద్రంలోని ఓ రైతుకు చెందిన మొక్కజొన్న పంటకు గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం నిప్పుపెట్టారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మూటికె వీరన్న–కమలమ్మ దంపతులు తమకున్న రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. ఆగంతకులు నిప్పు పెట్టడంతో రెండు ఎకరాల్లోని పంట పూర్తిగా దగ్ధమైంది. చేతికందిన పంట కాలిపోవడంతో రూ.రెండు లక్షలు నష్టపోయామని వీరన్న–కమలమ్మ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. పిండి రవి, మూటికె కట్టయ్య, మూటికె శ్రీనివాస్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు నానబోయిన రాజారాం, వైనాల వీరస్వామి, బత్తిని మల్లయ్య, పాండవుల రాంబాబు, మేడిపల్లి రాజు, మోటురి హరీశ్, వైనాల మధు తదితరులు రైతు కుటుంబ సభ్యులను పరామర్శించారు.


