మామిడి..తగ్గిన దిగుబడి
నర్సంపేట: జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా మా మిడి రైతుకు నష్టాలు తప్పడం లేదు. కోటి ఆశలతో మామిడి తోటలను పెంచుతున్న రైతులకు ఒక ఏడాది దిగుబడి రాకపోవడం, మరో ఏడాది ప్రకృతి వైపరీత్యాలు తప్పడం లేదు. మంచిగా దిగుబడి వచ్చిన సంవత్సరం ధరలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. జిల్లాలో 1,508 మంది రైతులు 5,960 ఎకరాల్లో మామిడి తోటలను సాగు చేశా రు.దీని ద్వారా 14,897మెట్రిక్ టన్నుల కాయ దిగుబడి రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే సోమవారం, మంగళవారం వచ్చిన గాలి బీభత్సానికి 10,500 మెట్రిక్ టన్నుల కాయ రాలిపోయింది. దీంతో మా మిడి రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు.
ఎకరాకు రూ.20 వేల అదనపు ఖర్చు.
రైతులు ఎకరం మామిడి తోటను రూ.30 వేల నుంచి రూ.50 వేలు చెల్లించి కౌలుకు తీసుకుని పూత దశ నుంచి క్రిమిసంహారక మందులు స్ప్రే చేస్తున్నారు. అధిక కాత కోసం సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సి రావడంతో ఎకరాకు 20 వేల రూపాయల వరకు అదనంగా ఖర్చు వస్తోంది. దిగుబడి వచ్చే సమయంలో గాలి వానలు, వడగళ్ల వానలు వచ్చి ఉన్న కొద్దిపాటి కాయను నేలమట్టం చేస్తున్నాయి. దీంతో ప్రతీసారి మామిడి సాగుపై ఆశతో ఉన్న రైతులకు నష్టాలు వస్తున్నాయి.
పూత నిలువక.. కాత కాయక..
గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మామిడి తోటలకు మొదట్లో పూత మంచిగానే వచ్చింది. కానీ, పూత నిలువకపోవడంతో 75 శాతం కాయలు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి, నర్సంపేట, నెక్కొండ, మండలాల్లో మామిడి తోటల పరిస్థితి దయనీయంగా ఉంది. దిగుబడి తగ్గడంతో ఈసారి మామిడికి ధర కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.
ఈ సంవత్సరం 75 శాతం కాయలు రాని పరిస్థితి
రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి
నష్టపోయిన రైతులు
సర్వే చేసి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
జిల్లాలో 1,508 మంది రైతులు..
5,960 ఎకరాల్లో సాగు
నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం కన్నారావుపేట గ్రామానికి చెందిన ఈ రైతు పేరు వేముల సంపత్‌రెడ్డి. కన్నారావుపేట గ్రామంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటను ఆరు సంవత్సరాలుగా పెంచుతున్నాడు. రెండు సంవత్సరాలు ఆశాజనకంగానే దిగుబడి వచ్చింది. కానీ, ఈ ఏడాది సమీపంలోని మరో ఎకరం మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటివరకు రూ.75 వేల పెట్టుబడి పెట్టినా కాయ అంతంత మాత్రంగానే వచ్చింది. రూ.25 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఒక సంపత్‌రెడ్డి పరిస్థితే కాదు.. జిల్లాలో మామిడి తోటలను పెంచుతున్న అనేక మంది రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.
జిల్లాలో మూడు సంవత్సరాలుగా మామిడి సాగు వివరాలు..
మండలం రైతులు ఎకరాలు
వర్ధన్నపేట 629 2,829.07
రాయపర్తి 239 1,099.07
పర్వతగిరి 349 1,249.18
ఖిలా వరంగల్ 70 209.34
సంగెం 48 146.11
నల్లబెల్లి 38 130.34
నెక్కొండ 25 88.25
నర్సంపేట 39 84.32
గీసుకొండ 42 56.04
చెన్నారావుపేట 11 29.28
ఖానాపురం 6 17.29
వరంగల్ 5 5.16
దుగ్గొండి 7 13.02
మామిడి..తగ్గిన దిగుబడి


