పవిత్రమైన పండుగ ఈస్టర్
ఖిలా వరంగల్: ప్రభువైన యేసు క్రీస్తు పరమపదించి తిరిగి ప్రాణాలతో లేచిన రోజున జరుపుకునే ఈస్టర్ పవిత్రమైన పండుగ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం వరంగల్ పుప్పాల గుట్టపై క్రైస్తవులు నిర్వహించిన ఈస్టర్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రైస్తవులతో కలిసి మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మతగురువుల దీవనలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీస్తు పరమపదించిన తర్వాత ఆయన అనుయాయులు నిరాశనిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతుండగా చూడలేక ప్రభువు యేసు మళ్లీ వారి కోసం ప్రాణాలతో వచ్చారని గుర్తు చేశారు. ఇంత పవిత్రమైన పర్వదినాన్ని ప్రార్థన కొండపై జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సీబీసీ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్, బాబు, క్రైస్తవులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ


