‘భూ భారతి’తో భూ సమస్యలు పరిష్కారం
కమలాపూర్: భూ భారతి చట్టం ద్వారా వివిధ రకాల భూ సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కమలాపూర్ కమ్యూనిటీ హాల్‌లో గురువారం నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుకోవాలని, ఇక్కడికొచ్చిన వారు తమ గ్రామాల్లోని రైతులు, ప్రజలకు ఈ చట్టంలోని అంశాలను తెలియజేయాలన్నారు. పది రోజుల్లో ప్రారంభం కానున్న ఈ చట్టం ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆ దరఖాస్తులను విచారించి పరిష్కారానికి చర్యలు చేపడుతామని తెలిపారు. ముందుగా భూ భారతి చట్టం మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ఆర్డీఓ రాథోడ్ రమేష్.. రైతులు, ప్రజలకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, ప్రజలు తమ భూ సమస్యలను కలెక్టర్, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన..
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను జూన్ మొదటి వారం వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో డీఆర్డీఏ–ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. కేంద్రానికి వచ్చిన, కొనుగోలు చేసిన ధాన్యం, గన్నీ సంచులు, టార్పాలిన్ కవర్లు, రికార్డుల నిర్వహణ, రైతుల ఆన్‌లైన్ వివరాలు, మిల్లులకు ధాన్యం తరలింపు, తేమ శాతం తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకుని అక్కడే ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. అకాల వర్షాలు పడే అవకాశాలున్నందున కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచామని, వాతావరణ పరిస్థితులను కొనుగోలు కేంద్రాలకు సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం మార్కెట్ యార్డులోని గోదాముల్లో బియ్యం నిల్వలను పరిశీలించారు.
ఇందిరమ్మ ఇళ్ల సందర్శన..
ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకోవా లని కలెక్టర్ సూచించారు. దేశరాజుపల్లిలో నిర్మిస్తు న్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. నిర్మాణ వివరాలు, ఇప్పటివరకై న వ్యయం, బిల్లుల చెల్లింపులను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ రాథోడ్ రమేష్, జిల్లా పౌరసరపరాల శాఖ అధికారి కొంరయ్య, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బాబు, ఏఓ రాజ్‌కుమార్, ఏఎంసీ చైర్ పర్సన్ ఝాన్సీరాణి, వైస్ చైర్మన్ ఐలయ్య, పీఏసీఎస్ చైర్మన్ సంపత్‌రావు, ఏఎంసీ డైరెక్టర్లు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
జూన్ మొదటి వారం వరకు
ధాన్యం కొనుగోళ్లు
ఇందిరమ్మ ఇళ్లు త్వరితగతిన
పూర్తి చేసుకోవాలి: కలెక్టర్ ప్రావీణ్య


