వెయ్యేళ్లు నిలబడేలా మేడారం పనులు | - | Sakshi
Sakshi News home page

వెయ్యేళ్లు నిలబడేలా మేడారం పనులు

Sep 23 2025 7:14 AM | Updated on Sep 23 2025 7:14 AM

వెయ్యేళ్లు నిలబడేలా మేడారం పనులు

వెయ్యేళ్లు నిలబడేలా మేడారం పనులు

ములుగు/ఎస్‌ఎస్‌ తాడ్వాయి : సమ్మక్క–సారలమ్మ కొలువైన మేడారాన్ని వెయ్యేళ్లు నిలబడేలా అభివృద్ధి పనులు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, మాస్టర్‌ప్లాన్‌ ఆవిష్కరణ కోసం మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి మేడారం వస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం ములుగులో మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా ఎన్నికల ముందు 2023 ఫిబ్రవరి 7న మేడారంలో సమ్మక్క, సారలమ్మ దీవెనలు తీసుకొని సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించారని తెలిపారు. 2024లో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం నుంచి ఎన్నికల భేరి మోగించి రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నారన్నారు. మేడారానికి మంజూరైన రూ.150 కోట్ల నిధులతో మూడు నెలల్లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నట్లు వివరించారు. భక్తులకు అనుగుణంగా, పూజారుల విశ్వాసాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. భక్తితో, విశ్వాసంతోనే గద్దెల ప్రాంగణం చుట్టూ సాలాహారం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అమ్మవార్లను దర్శించుకునే సమయంలో తొక్కిసలాటలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో కొంతమంది తప్పిపోతున్నారని అలాంటి ఘటనలు జరగకుండా అందరి అభిప్రాయం మేరకు గద్దెల ప్రాంతాన్ని గ్రానైట్‌తో తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. రూ.15 కోట్లతో జంపన్న వాగు నుంచి మేడారం గద్దెల వరకు రహదారిని విస్తరించి సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.5కోట్లతో జంపన్నవాగుకు ఇరువైపులా గ్రీనరీతోపాటు వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. పర్యాటక ప్రదేశాలైన రామప్ప, లక్నవరం, మేడారం జాతర ప్రత్యేకతలు తెలుపుతూ వాటి కళాత్మకతను పర్యాటకులకు తెలియజేసే విధంగా గట్టమ్మ నుంచి మేడారం వరకు ఉన్న జంక్షన్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఆమె వెంట కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్‌, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్‌ గౌడ్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ బానోతు రవిచందర్‌, ములుగు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కళ్యాణి ఉన్నారు.

పనుల పరిశీలన, మాస్టర్‌ప్లాన్‌ ఆవిష్కరణకు నేడు మేడారం రానున్న సీఎం రేవంత్‌రెడ్డి

భక్తులు, పూజారుల విశ్వాసాలకు అనుగుణంగా గద్దెల ప్రాంతం అభివృద్ధి

రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క

మేడారంలో ఏర్పాట్ల పరిశీలన..

మేడారాన్ని సోమవారం కలెక్టర్‌ దివాకర టీఎస్‌, ఎస్పీ శబరీశ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవి చందర్‌, ములుగు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కళ్యాణితో కలిసి మంత్రి సీతక్క పరీశీలించారు. సమ్మక్క సారలమ్మ దేవతలను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మేడారంలో శంకుస్థాపన, పరిశీలించే పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్‌ పర్యటనకు జిల్లాలోని అన్ని మండలాలనుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని సీతక్క పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రెవెన్యూ మహేందర్‌ జీ, ఆర్డీఓ వెంకటేశ్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, ఏఎస్‌పీ శివం ఉపాధ్యాయ, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, ఈఓ వీరస్వామి, ఏపీఓ వసంతరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement