ఏలూరులో కాల్‌మనీ కలకలం
ఏలూరు టౌన్ : ఏలూరులో కాల్‌మనీ కలకలం రేగింది. కుటుంబ అవసరాల కోసం రుణం తీసుకుంటే, ఇళ్లకు వచ్చి మరీ మహిళలు, బాలికలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ సోమవారం ర్యాలీగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు జిల్లావ్యాప్తంగా వడ్డీ వ్యాపారి మేడపాటి సుధాకర్‌రెడ్డి అతని అనుచరులు మహ్మద్ అఖిల్ రెహమాన్, గూడవల్లి విద్యాసాగర్, రాజేష్, మరో మహిళ ఆగడాలతో మధ్యతరగతి వర్గాలు తీవ్ర మానసిక వ్యథకు గురవుతున్నాయి. రాత్రి 10 గంటల సమయంలో ఇళ్లకు వచ్చి మహిళలను, బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్టు బాధిత మహిళలు ఎస్పీకు గోడు వెళ్లబోసుకున్నారు. తీసుకున్న అప్పుకు ఎంతకాలం డబ్బులు చెల్లించినా తీరలేదంటూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, డైలీ కూలీలు కాల్‌మనీ గ్యాంగ్ బారినపడ్డారన్నారు. రూ.50 వేలు అప్పుగా తీసుకుంటే ఐదు ప్రామిసరీ నోట్లు, రెండు రూ.100 ల స్టాంప్‌పేపర్లు, రెండు ఖాళీ తెల్లకాగితాలు, చెక్కులపై సంతకాలు పెట్టించుకున్నారని మహిళలు వాపోయారు. ఈ మొత్తానికి రూ.లక్షల్లో వసూలు చేశారని, ఏలూరుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బాధితులు ఉన్నట్టు చెప్పారు. రౌడీ మూకలతో ఇళ్లకు వస్తూ దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఎస్పీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ
జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా అధిక వడ్డీల పేరుతో అక్రమాలకు పాల్పడుతూ మహిళలను, ప్రజలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ కుటుంబ అవసరాల నిమిత్తం ప్రైవేటు వ్యక్తుల వద్ద డబ్బులు రుణంగా తీసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. డబ్బులు తీసుకునే సమయంలో ప్రామిసరీ నోట్లను పూర్తి చేయాలనీ, చెక్కులపైనా ఎంత తీసుకుంటున్నామో రాయాలని అన్నారు. అధిక వడ్డీల పేరుతో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తారని ఆయన హెచ్చరించారు.
జిల్లా ఎస్పీని కలిసిన బాధితులు
వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment