కారు ఢీకొని వ్యక్తి మృతి
ద్వారకాతిరుమల: టీ కోసం రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని లక్ష్మీనగర్ జాతీయ రహదారిపై గురువారం జరిగింది. ఎస్సై టి.సుధీర్ తెలిపిన కథనం ప్రకారం. తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరగవాడ గ్రామానికి చెందిన బట్టు సేట్రామ్(55) లక్ష్మీనగర్‌లోని సింధూర పేపర్ ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. గురువారం రాత్రి టీ తాగేందుకు తన బంధువు బట్టు కృష్ణతో కలసి ఘటనా స్థలం వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఆ సమయంలో కొవ్వూరు నుంచి ఏలూరు వైపునకు వెళుతున్న కారు సేట్రామ్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సేట్రామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై సుధీర్ పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అగ్నిప్రమాదంలో వృద్ధురాలి సజీవ దహనం
పోడూరు: గుమ్మలూరు గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఒంటరిగా నివసించే వృద్ధురాలు వర్ధనపు సరోజిని(72) సజీవ దహనమైంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని పెదపేట ప్రాంతంలో సరోజిని తాటాకింట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు భర్త, పిల్లలు లేరు. కాగా బుధవారం రాత్రి వంట చేశాక కట్టెలపొయ్యిని సరిగా ఆర్పకపోవడంతో రాత్రి 11 గంటల సమయంలో ఆమె నివసిస్తున్న ఇంటి నుంచి మంటలు వ్యాపించాయి. స్థానికులు చూసేసరికే మంటలు దట్టంగా వ్యాపించడంతో లోపలికి వెళ్లలేకపోయారు. అప్పటికే వృద్ధురాలు మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. సమాచారం అందడంతో పాలకొల్లు అగ్నిమాపక సిబ్బంది వాహనంతో వచ్చి మంటలను అదుపు చేశారు. ఆర్‌ఐ కె.రాంబాబు వివరాలు సేకరించారు. ఘటనపై ఎస్సై సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్ సమక్షంలో వీఆర్‌ఓ కె.శ్రీనివాసరావు సరోజిని మృతదేహానికి పంచనామా నిర్వహించారు. మృతదేహం సగంపైగా కాలిపోవడంతో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఘటనా ప్రదేశానికి వచ్చి ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బంధువులు అంతక్రియలు నిర్వహించారు.
పట్టపగలే ఇంట్లోకి వచ్చిచెయిన్ స్నాచింగ్
పాలకోడేరు: పట్టపగలే చెయిన్ స్నాచింగ్ చేసిన ఘటన శృంగవృక్షంలో కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. రావి చెర్వుగట్టున నివాసం ఉంటున్న పంపన అంజలి ఏడాది క్రితమే పెళ్లి చేసుకుని అత్తవారి ఇంట్లో ఉంటోంది. భర్త, అత్తమామలు కూలిపనికి వెళ్లగా ఆమె ఒక్కరే ఉన్న సమయంలో గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఒక వ్యక్తి శుభలేఖ ఇవ్వడానికి వచ్చానని చెప్పి.. తెల్ల కాగితం ఆమె చేతిలో పెట్టాడు. ఆమె మెడలో ఉన్న సూత్రాల తాడు గట్టిగా లాగడంతో వెంటనే తేరుకున్న అంజలి ప్రతిఘటించగా మెడపై నుంచి బలవంతంగా లాక్కుని పారిపోయాడు. ఇంటి బయట మరో అగంతకుడు మోటార్ బైక్‌పై ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పాలకోడేరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కారు ఢీకొని వ్యక్తి మృతి


