ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరానికి చెందిన ప్రఖ్యాత కూచిపూడి, భరతనాట్యం నాట్య గురువు ఏ.పార్వతీ రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారం హంస అవార్డు కళా రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. గత 45 ఏళ్లుగా ఏలూరులో కళా దీపిక నృత్య అకాడమీ ద్వారా వేలాదిమంది విద్యార్థులను నాట్య కళాకారులుగా తీర్చిదిద్దిన ఉత్తమ నాట్య గురువు. నాట్య కళాకారిణే కాకుండా మంచి సంగీత కళాకారిణి. ఎన్నో సంస్థలు ఆమెను వివిధ బిరుదులతో, సన్మానాలతో గౌరవించాయి. ఆమె కళారత్న పురస్కారానికి ఎంపికై న సందర్భంగా నగరానికి చెందిన ప్రముఖ నృత్య కళాకారుడు కళారత్న కేవీ సత్యనారాయణ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పార్వతీ రామచంద్రన్ నృత్య రంగానికి చేస్తున్న విశేష సేవలను గుర్తించి తమ కేవీఎస్ ట్రస్ట్ ద్వారా కేవీ సత్యనారాయణ ప్రతిభా పురస్కారంతో 2022లో పార్వతి రామచంద్రన్‌ను సత్కరించామన్నారు. నాట్యానికి జీవితం అంకితం చేసిన గొప్ప కళాకారిణి పార్వతి రామచంద్రన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కళా రత్న హంస అవార్డు ఇచ్చి సత్కరిస్తున్నందుకు కళాకారులు ఎంతో సంతోషిస్తున్నారన్నారు.


