రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
పెనుమంట్ర: మండలంలోని మార్టేరు రోడ్డులోని బ్రాహ్మణ చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సిద్ధాంతం గ్రామానికి చెందిన సతీష్ బైక్‌పై వెళ్తూ బ్రాహ్మణచెరువు గ్రామంలో అదుపుతప్పి ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మరణించగా సతీష్‌కు తీవ్రగాయాలయ్యాయి. సతీష్‌ను రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పెనుమంట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
డ్రెయిన్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం
భీమవరం: భీమవరం రెండో పట్టణ పరిధి రాయలం డ్రెయిన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్లు వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, కేసు కూడా నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పెదవేగి : గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో విజయరాయికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పెదవేగి ఎస్సై కె.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం విజయరాయి గ్రామానికి చెందిన కంబంపాటి రాజేంద్రప్రసాద్ ఈ నెల 9న సాయంత్రం స్థానిక నూజివీడు సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రోజువారీ పని ముగించుకుని ఇంటి వెళ్లే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో స్థానికులు రాజేంద్రప్రసాద్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడి భార్య దుర్గాభవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


