వేతన యాతన తీరేదెప్పుడు..?
తణుకు అర్బన్: ప్రభుత్వాస్పత్రుల్లో సేవలందిస్తున్న కార్మికులకు వేతనాలివ్వడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. నిత్యం ఆస్ప్రత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సేవలు చేసే వారి ఇళ్లు ఆకలికేకలతో అల్లాడుతున్నాయి. శుభ్రత, భద్రత, క్షేమంగా ఇంటికి చేర్చే రంగాల్లో వారు సేవలు అమోఘంగా చేస్తున్నా సరైన సమయానికి వేతనాలు అందించడం లేదని కార్మికులు వాపోతున్నారు.తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ విభాగం, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా గతం నుంచి రోగులకు సత్వర సేవలందుతున్నాయి. కానీ నేడు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలలు, సెక్యూరిటీ విభాగం 2 నెలలు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లకు రెండు నెలలు జీతం పెండింగ్‌లో ఉండడంతో కుటుంబాలను పోషించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
కుదిరితే అప్పులు..లేకపోతే పస్తులు
జీతం రాకపోయినా ఖర్చులు తప్పవు అనే ఉద్దేశంతో ఇళ్లు గడిపేందుకు అప్పులు చేస్తున్నామంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో వచ్చే వ్యర్థాలతోపాటు వివిధ వార్డుల్లో వచ్చే వ్యర్థాలను తొలగించడంలో పారిశుద్ధ్య కార్మికులు కీలకంగా పనిచేస్తుంటారు. రక్తపు వ్యర్థాల తొలగింపులో రోగాలబారిన పడుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లోనే విధుల్లో ఉండాల్సి వస్తుందని అయినప్పటికీ ఏ నెల వేతనం ఆ నెల ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు రోగుల రక్షణ, భద్రతలో కీలకంగా ఉంటారు. రోగులు ఇబ్బందులు పడకుండా క్యూలైన్‌లో పంపించడంతోపాటు ఎలాంటి ఘర్షణలు జరిగినా సర్దబాటు చేయడంలోను ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. లోపలకు వచ్చేవారితోపాటు బయటకు వెళ్లేవారిని గమనిస్తూ ఎటువంటి చోరీలు జరగకుండా చూస్తుంటారు.
క్షేమంగా ఇంటికి చేర్చినా..
ఆస్పత్రిలో ప్రసవాల అనంతరం తల్లి, బిడ్డను క్షేమంగా వారి ఇంటికి చేర్చడంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు సత్వర సేవలు అందిస్తుంటారు. అరకొర వేతనంతోనే విధులు నిర్వర్తిస్తూ బాలింతలను సురక్షితంగా ఇంటికి చేరుస్తూ వారి ప్రశంసలు పొందుతున్నారు. గత ఐదేళ్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచిన ఈ సేవలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వారి జీవనోపాధి కుంటుపడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, నాయకులు స్పందించి ఆయా కార్మికులకు వేతనాలు చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అప్పులతో కాలం గడుపుతున్నారు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చే స్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం ఇవ్వకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ వేతనానికి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ వేతనం కూడా ఏ నెల వేతనం ఆ నెలలో ఇవ్వకుండా నెలలపాటు బకాయిలు పెట్టి వారిని అప్పులపాలు చేస్తున్నారు. కార్మికుల ఆకలికేకలు పట్టించుకోని ప్రభుత్వాలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
– కోనాల భీమారావు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు
ప్రభుత్వాస్పత్రుల్లో కార్మికులకు
నెలల తరబడి వేతనాల పెండింగ్
అప్పులు చేసి బతుకుతున్నామంటూ ఆవేదన
జిల్లాలో ప్రభుత్వాస్పత్రిలో కార్మికులు
విభాగం కార్మికుల సంఖ్య
పారిశుద్ధ్యం 152
సెక్యూరిటీ 110
తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు 14
వేతన యాతన తీరేదెప్పుడు..?
వేతన యాతన తీరేదెప్పుడు..?


