మండల సమావేశం బహిష్కరణ
యలమంచిలి: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. ఊహించని పరిణామానికి అటు అధికారులు, ఇటు కూటమి సర్పంచ్‌లు బిత్తరపోయారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీఓ నందిపాటి ప్రేమాన్విత ఏర్పాటు చేశారు. సమావేశానికి వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ప్రతిపక్ష కూటమి సభ్యులు ఎవరూ రాలేదు. ఇటీవలె వైఎస్సార్ సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన మేడపాడు ఎంపీటీసీ సభ్యురాలు డేగల సూర్యప్రభ మాత్రం వచ్చారు. సమావేశాన్ని ఇన్‌చార్జి ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభిస్తూ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేస్తామని చెబుతుండగా వైఎస్సార్ సీపీకి చెందిన గుంపర్రు ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో తనను అన్యాయంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారని మండిపడ్డారు. ఏనుగువానిలంక ఎంపీటీసీ సభ్యులు వినుకొండ ధనలక్ష్మి మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 12 మంది సభ్యులు ఉన్నా నలుగురు సభ్యులు ఉన్న కూటమి నాయకులు చేసిన తప్పుడు ఆరోపణలకు అధికారులు వత్తాసు పలికి ఎన్నికను అర్ధాంతరంగా నిలిపివేయడానికి నిరసనగా మండల సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. దీంతో మిగిలిన 11 మంది సభ్యులు ఆమె వెంట బయటకు వెళ్లిపోయారు. సర్పంచ్‌ల చాంబర్ అధ్యక్షుడు కవురు గోపి మాట్లాడుతూ ఎంపీటీసీ సభ్యులకు మద్దతుగా సర్పంచ్‌లు కూడా సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికీ మేడపాడు ఎంపీటీసీ సభ్యురాలు డేగల సూర్యప్రభ మాత్రమే సంతకం చేశారు. దీంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ నందిపాటి ప్రేమాన్విత ప్రకటించారు.
యలమంచిలి ఎంపీపీ ఎన్నిక వాయిదాపై వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల నిరసన
మండల సమావేశం బహిష్కరణ


