వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలి
పెంటపాడు: మత స్వేచ్ఛను హరించేలా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును తక్షణం రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళింగ లక్ష్మణరావు, ఇతర సంఘాల ప్రతినిధులు కోరారు. శనివారం పెంటపాడు గేట్ సెంటర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులతో కలిసి కమ్యూనిస్టులు భారీ నిరసన చేపట్టారు. కార్యక్రమానికి ఆధ్వర్యం వహించిన కళింగ లక్ష్మణరావు మాట్లాడుతూ గుజరాత్ పెట్టుబడి దారులకు ప్రధాని అనుకూలంగా ఉండటం తగదన్నారు. వక్ప్ బిల్లు పట్ల ముస్లింలు తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పోరాటం హిందూ, ముస్లింల వివాదాలకు దారితీయకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ముస్లిం సంఘ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు షేక్ హాసేన్ మాట్లాడుతూ మైనారీటీ హక్కుల కోసం చేస్తున్న ఈ నిరసనకు తప్పక కేంద్రం తలొగ్గాలన్నారు. ఈ చట్టాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. సీపీఐ నాయకులు వంకా అప్పారావు, దిద్దే నాగేశ్వరరావులు మాట్లాడుతూ ఓటు బ్యాంక్ కోసం బీజేపీ ప్రభుత్వం చిచ్చు పెట్టడం తగదన్నారు. షేక్ ఇస్మాయేల్, షేక్ బాజీ, షేక్ హుస్సేన్, మస్తాన్, రజియా, షహాదాబి, ఫాతిమాబీ, షేక్ లాల్‌బీ తదితరులు పాల్గొన్నారు.


