క్షీరారామలింగేశ్వరస్వామికి చక్రస్నానం
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి కళ్యాణోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివార్లకు చక్రస్నానం, త్రిశూల స్నానం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మిగతా ఆలయంలో చక్ర స్నానం, త్రిశూల స్నానంలో ఏదొకటి జరుగుతుందని.. పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో మాత్రం రెండూ జరుగుతాయని ఆలయ ప్రధానార్చకుడు సన్నిధిరాజు కిష్టప్ప తెలిపారు. భమిడపాటి వెంకన్న బ్రహ్మత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులు చక్ర, త్రిశూల స్నానాల్లో పాల్గొన్నారు. అనంతరం పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో చండీహోమం నిర్వహించారు. ఈ హోమంలో 12 మంది దంపతులు పాల్గొన్నారు. కల్యాణోత్సవాల్లో భాగంగా 27 మంది దంపతులతో స్వామి, అమ్మవార్లకు 27 కావిళ్లతో సారె సమర్పించారు. ముందుగా ఆలయం నుంచి బయలుదేరి మెయిన్‌రోడ్డు, ముచ్చర్ల వారి వీధి, కారుమూరి వారి వీధి గుండా గొడుగు కావిళ్లతో ఊరేగి అనంతరం స్వామివారికి సమర్పించారు. పురుషులు కావిళ్లు మోయగా, మహిళలు భర్తలకు గొడుగులు పట్టుకుని సంప్రదాయబద్ధంగా తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, సూపరిండెంట్ వాసు, అర్చకులు అనిల్, వీరబాబు, పూర్ణయ్య, కె.వి కృష్ణవర్మ, మీసాల రాము, జక్కంపూడి కుమార్, మురహరి ఈశ్వరరావు, బోణం మునసబు తదితరులు పాల్గొన్నారు.
27 మంది దంపతులతో కావిళ్లు సమర్పణ


