
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి ఆయనతో పాటు కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నివాళులర్పించారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ అంబేడ్కర్ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని మహోన్నత దివ్య శక్తిగా ఎదిగారని కొనియాడారు. ఎస్పీ మాట్లాడుతూ అందరికీ సమాన హక్కుల ధ్యేయంతో రాజ్యాంగాన్ని రచించి దేశానికి అందించిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అన్నారు. మాల మహానాడు అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్, డీవీఎంసీ సభ్యులు చీకటమిల్లి మంగరాజు, పొన్నమండ బాలకృష్ణ, జిల్లెళ్ళ సత్య సుధామ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, డీఆర్‌ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీవో కె.రాహుల్ కుమార్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బీ.వీ.ఎస్.బి రామాంజనేయ రాజు తదితరులు పాల్గొన్నారు. అంతకముందు అంబేడ్కర్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో అంబేడ్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు.
అంబేడ్కర్ మార్గంలో నడవాలి: మండలి చైర్మన్
వీరవాసరం: బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు పిలుపునిచ్చారు. నందమూరి గరువులో నూతనంగా నిర్మించిన అంబేడ్కర్ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి అంబేడ్కర్ సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వీరవల్లి దుర్గ భవాని, జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, సర్పంచ్ మేకల వెంకట చలపతి, మెంటే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి