‘ఫీజు’ కోసం పోరు
భీమవరం: నిబంధనలు మీరిన ప్రైవేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని, జీఓ 77, 107, 108లను రద్దు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలంటూ గురువారం భీమవంరలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటగోపి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జీఓ 77 రద్దు చేస్తామని, పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని, అయినా వీటిని అమలు చేయలేదన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో ఎం. వెంకటేశ్వర్లుకు అందజేశారు. ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ డిన్ను చందు, జిల్లా కన్వీనర్ వెంకట్, రాష్ట్ర కార్యనిర్వాహకుడు సాయి, భీమవరం నగర కార్యదర్శి జగదీష్ పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల నిరసన
తణుకు అర్బన్: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మి కులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా చేశారు. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని, పెన్షన్, గ్రాట్యూటీ ఇవ్వాలని, ఆప్కాస్ రద్దు చేస్తే కార్మికులను పర్మినెంట్ చేయాలని, సంక్షేమ పథకాలు ఇవ్వాలని నినదించారు. యూనియన్ అధ్యక్షుడు యు.శ్రీనివాసరావు, కార్యదర్శి జి.విజయకుమార్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా పనిచేస్తున్నామని, తక్కువ వేతనాలతో బతకడం కష్టంగా ఉందన్నారు. సీఐటీయూ నాయకులు ఎన్.ఆదినారాయణ బాబు, దాసరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గళమెత్తిన ఆర్టీసీ కార్మికులు
తణుకు అర్బన్: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎన్‌ఎంయూఏ తణుకు డిపో కమిటీ అధ్యక్షుడు సరిదే ఏసుబాబు డిమాండ్ చేశారు. తణుకు ఆర్టీసీ డిపోలో గురువారం కార్మికులు నిరసన తెలిపారు. 1–2009 సర్కులర్ ప్రకారం విధివిధానాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, 114 జీఓ ప్రకారం నైట్ అవుట్లకు రూ.400 జీతం ఇవ్వాలన్నారు. ఈహెచ్‌ఎస్ పద్ధతిలోనే పాత వైద్యవిధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను వెంటనే తీయాలని కోరారు. ఎన్‌ఎంయూఏ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈ కార్య క్రమం చేపట్టామన్నారు. డిపో కార్యదర్శి బీవీఎన్‌ఎస్ సుబ్బారావు, కోశాధికారి ఎస్‌వీ రావు, సహాయ కార్యదర్శి టి.శ్రీను, ఉపాధ్యక్షుడు కేవీ రత్నం, వర్కింగ్ ప్రెసిడెంట్ పీఎస్ రాజు, కార్మికులు పాల్గొన్నారు.
శ్రీవారికి కాసుల పంట
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదును స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో గురువారం లెక్కించారు. చినవెంకన్నకు విశేష ఆదాయం సమకూరింది. 20 రోజులకు నగదు రూపంలో రూ. 1,93,36,657, 326 గ్రాముల బంగారం, 4.149 కిలోల వెండితో పాటు విదేశీ కరెన్సీ లభించినట్టు ఈఓ సత్యనారాయణమూర్తి తెలిపారు. అలాగే లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2,000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.20 వేలు లభించాయన్నారు. ఆల య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘ఫీజు’ కోసం పోరు
‘ఫీజు’ కోసం పోరు


