అనారోగ్య కారణాలతో వృద్ధుడి ఆత్మహత్య
చౌటుప్పల్: అనారోగ్య కారణాలతో ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగడపల్లి గ్రామానికి చెందిన లింగాల రాములు(85)కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ నెల 2న తిరుపతికి వెళ్లే క్రమంలో హైదరాబాద్‌లో ఉంటున్న తన వద్ద ఉంటున్న రాములును అతడి కుమారుడు చౌటుప్పల్‌లో నివాసముంటున్న తన సోదరి సరస్వతి ఇంట్లో వదిలిపెట్టాడు. ఈ నెల 4న పెన్షన్ తీసుకునేందుకు స్వగ్రామమైన తంగడపల్లికి రాములు వెళ్లాడు. ఆదివారం ఉదయం కుమారుడు రాములుకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో పక్కింటి వారికి సమాచారం అందించాడు. వారు వెళ్లి చూడగా ఇంట్లో ఉరేసుకుని రాములు మృతిచెంది ఉన్నాడు. మృతుడి కుమారుడు భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
ఉరేసుకుని వ్యక్తి..
పెన్‌పహాడ్: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలం సింగారెడ్డిపాలెం గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగారెడ్డిపాలెంకు చెందిన గునగంటి జనార్దన్(36) ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య చంద్రకళ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులను సంప్రదించగా స్పందించలేదు.
అప్పుల బాధతో
యువకుడి బలవన్మరణం
పెద్దఅడిశర్లపల్లి: అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుగొమ్ము మండలం చిన్నమునిగల్ గ్రామానికి చెందిన కేతావత్ అరవింద్(27) అప్పుల బాధ తాళలేక ఆదివారం పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం గ్రామంలోని పుష్కర ఘాట్ వద్ద పురుగుల మందు తాగాడు. అనంతరం భార్యకు వీడియోకాల్ చేసి తాను పురుగుల మందు తాగినట్లు చెప్పాడు. కుటుంబ సభ్యులు వెంటనే పుష్కర ఘాట్ వద్దకు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న అరవింద్‌ను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
విద్యుదాఘాతంతో
రైతు మృతి
మిర్యాలగూడ టౌన్: వ్యవసాయ బావి వద్ద గడ్డి కోస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ గ్రామ సమీపంలో జరిగింది. మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బతండా గ్రామానికి చెందిన రైతు మాలోతు భద్రు(60) ఆదివారం శ్రీనివాస్‌నగర్ గ్రామ సమీపంలో గల మాలోతు బాలు పొలంలో పచ్చగడ్డి కోస్తుండగా.. ప్రమాదవశాత్తు కొడవలి పక్కనే ఉన్న బోరు మోటారు వైరుకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. భధ్రు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెతుక్కుంటూ వెళ్లగా విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు మాలోతు లచ్చుసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనారోగ్య కారణాలతో వృద్ధుడి ఆత్మహత్య


