బ్రెయిన్ స్ట్రోక్‌తో చేనేత కార్మికుడు మృతి
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి పట్టణ కేంద్రంలోని వినోబాభావేనగర్‌కు చెందిన చేనేత కార్మికుడు వల్లభదాసు రాజు(53) బ్రెయిన్‌స్ట్రోక్‌తో శనివారం రాత్రి మృతిచెందాడు. రాజు ఈ నెల 4న బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిన రాజుకు శస్త్రచికిత్స చేయాలని, ఇందుకు రూ.3లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. వైద్యం చేయించడానికి ఆర్థిక స్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుండగానే శనివారం రాత్రి మృతిచెందాడు. ఆదివారం రాత్రి రాజు భౌతికికాయానికి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య దుర్గమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడు కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నాడని, అతడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ చేనేత జన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కర్నాటి పురుషోత్తం, గౌరవ అధ్యక్షుడు వేశాల మురళి కోరారు.


