హస్తకళలను ప్రోత్సహించాలి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చే భక్తులు హస్తకళా విక్రయశాలలో వస్తువులను కొనుగోలు చేసి హస్తకళలను ప్రోత్సహించాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలోని బస్టాండ్ చెంత తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్కొండ హస్తకళా విక్రయశాలను బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. వివిధ హస్తకళలకు సంబంధించిన వస్తువులు గోల్కొండ హస్తకళల విక్రయశాలలో లభిస్తాయని పేర్కొన్నారు. హస్తకళలను ప్రోత్సహించడానికి ఈ విక్రయశాలను ఏర్పాటు చేసేందుకు ఆలయ ఈఓ భాస్కర్‌రావు కృషిచేశారని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి హస్తకళలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళలను తీసుకువచ్చి ఇందులో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హస్తకళలను, నైపుణ్యాన్ని పెంపొందించాలని చూస్తోందన్నారు. పెంబర్తి నుంచి హస్త కళాకారులు, బంజారా కళాకారులు వచ్చి డెమోలను ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ.. సుమారు 45రోజుల్లోనే యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో హస్తకళల విక్రయశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విక్రయశాలతో పలువురికి జీవనోపాధి లభిస్తుందన్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హస్తకళాకారులు తాము రూపొందించిన మోడల్స్‌ను ఈ విక్రయశాలకు తీసుకొచ్చారన్నారు. రాబోయే రోజుల్లో హస్తకళల విక్రయశాలలను మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ భాస్కర్‌రావు, తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ ఓఎస్‌డీ బాషా, మసూద్ అలీ, వేణుగోపాల్, గాయత్రి, సుల్తానా, శ్రీపాణి, మహేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఫ దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
శైలజా రామయ్యర్


