విద్యుదాఘాతంతో వరిగడ్డి దగ్ధం
హుజూర్‌నగర్‌రూరల్: విద్యుదాఘాతంతో వరిగడ్డి దగ్ధమైన ఘటన శుక్రవారం హుజూర్‌నగర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని వేలపసింగారం గ్రామానికి చెందిన రైతులు కర్నె వీరారెడ్డి, కలకండ జయరాజులకు చెందిన ట్రాక్టర్లలో తమ వ్యవసాయ పొలంలో ఉన్న వరిగడ్డిని శుక్రవారం ఉదయం గ్రామానికి తీసుకువస్తున్నారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో ఉన్న పశువుల ఆస్పత్రికి చెందిన విద్యుత్ వైరుకు గడ్డి ట్రాక్టర్ తగలడంతో వైరు తెగి వరిగడ్డిపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అంతేకాకుండా వెనుక వస్తున్న జయరాజు చెందిన ట్రాక్టర్‌లో ఉన్న గడ్డికి మంటలు అంటుకున్నాయి. ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. వరిగడ్డి పూర్తిగా దగ్ధమైందని సుమారు రూ.15 వేలు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.


