నేడు రక్తదాన శిబిరం
భువనగిరిటౌన్ : మహానీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం భువనగిరిలోని బాగాయత్ హైస్కూల్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతరావుతో పాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
అయ్యప్ప సేవకుడికి
పురస్కారం
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని ఇంద్రియాలకు చెందిన అయ్యప్ప సేవకుడు సుర్వి బాలరాజుగౌడ్ గురుస్వామి పరశురాం పురస్కారం అందుకున్నారు. కేరళలోని మలయాళ భగవతి పీఠం, ఎస్‌ఎస్‌ఎస్ డివోషనల్ గ్రూప్ సంయుక్తంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో టావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఆనంద్‌గోపన్, శబరిమలై పూర్వ మేల్ శాంతిశంకరన్ నంబూద్రి, బ్రహ్మశ్రీ శివ నరసింహన్ తాంత్రి, సుబ్రహ్మణ్యం నంబూద్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. అయ్యప్పస్వామి దీక్ష వ్యాప్తి, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా పురస్కారం దక్కినట్లు బాలరాజు తెలిపారు.
24న పాడి రైతుల సదస్సు
భువనగిరిటౌన్ : ఆలేరులో ఈనెల 24న జరిగే పాల రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజుగౌడ్ పిలుపునిచ్చారు. శనివారం భువనగిరిలోని సుందరయ్య భవన్‌లో మేక అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రైతు సంఘం జిల్లా అఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి ఉపాధి పొందుతున్నాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ డెయిరీలు తక్కువ ధరకు పాలు సేకరిస్తుండడంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. నెలనెలా పాల బిల్లులు కూడా రావడం లేదన్నారు. సదస్సులో పాడి రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ జహంగీర్, మంగ నర్సింహులు, జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు రక్తదాన శిబిరం


