ప్రమాదవశాత్తు ఆయిల్ పామ్ తోట దగ్ధం
గుర్రంపోడు: మండలంలోని చామలేడు గ్రామానికి చెందిన కొండ పెద్దులు ఆయిల్ పామ్ తోట ఆదివారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఉపాధిహామీ కూలీలు తన ఆయిల్ పామ్ తోట వెంట కాల్వలో కంపచెట్లు తొలగించి నిప్పు పెట్టి వెళ్లడంతో ఆ మంటలు తన తోటకు అంటుకొని చెట్లు దగ్ధమైనట్లు బాధిత రైతు తెలిపాడు. మొత్తం మూడెకరాల తోటలో దాదాపు రెండెకరాలలో కాపు కొచ్చే దశలో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు, డ్రిప్పు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.4లక్షల మేర నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత రైతు తెలిపారు.
చౌల్లరామారంలో..
అడ్డగూడూరు: అడ్డగూడూరు మండలం చౌల్లరామారం గ్రామంలోని సౌట కుంటలో సోమవారం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌట కుంటలో ఇటీవల ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు తొలగించిన కంప చెట్లకు సోమవారం నిప్పు పెట్టడంతో పెద్దఎత్తున మంటలు ఎగిసి పక్కనే ఉన్న వరి పొలాల వైపు వ్యాపించాయి. స్థానిక రైతులు గమనించి మోత్కూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు.


