ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
చౌటుప్పల్: ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని గణేష్‌నగర్ కాలనీలో మంగళవారం రాత్రి జరిగింది. బుధవారం సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామానికి చెందిన పందేటి చలపతిరావు(38) చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో గల దివీస్ ఫార్మా కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. గత 20 ఏళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని గణేష్‌నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. మంగళవారం సాయంత్రి చలపతిరావు భార్య భవిత ప్రార్ధన నిమిత్తం స్థానికంగా చర్చికి వెళ్లింది. కుమార్తె ఇంట్లోనే ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జీవితంపై విరక్తితో చలపతిరావు రాత్రి 8గంటల సమయంలో ఇంట్లోని మరో గదికి వెళ్లి సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రార్ధన ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన భవిత తన భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని చూసి బోరున విలపించింది. మృతుడి తండ్రి వీరరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.


