యూనిఫాం వస్త్రం వచ్చేసింది
జూన్ మొదటి వారంలో అందజేస్తాం
జిల్లాకు చేరుకుంటున్న యూనిఫాం వస్త్రాల బాధ్యతలను ఎంఈఓలు చూసుకుంటున్నారు. వారి పర్యవేక్షణలోనే ఎమ్మార్సీ భవనంలో వస్త్రాలను భద్రపరుస్తున్నారు. వస్త్రం పూర్తిగా వచ్చిన తర్వాత సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సమన్వయంతో స్వయం సహాయక సంఘాల సభ్యులతో కుట్టించనున్నారు. జూన్ మొదటి వారంలోనే విద్యార్థులకు యూనిఫాం అందజేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– సత్యనారాయణ, డీఈఓ
భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిఏటా యూనిఫాం అందజేస్తోంది. వాటికి సంబంధించిన వస్త్రాన్ని తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెస్కో) సరఫరా చేస్తోంది. ఈమేరకు జిల్లాకు అవసరమైన వస్త్రాన్ని పంపించారు. వీటిని ఆయా మండలాల్లోని ఎమ్మార్సీ భవనాల్లో భద్రపర్చారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో అందించే దుస్తుల్లో స్వల్ప మార్పులు చేశారు. చొక్కాలు, లాంగ్ ట్రాక్‌లకు పట్టీలు, భుజాలపై కప్స్ వంటివి లేకుండా సాధారణ డిజైన్ చేశారు. ఈసారి 6, 7వ తరగతుల విద్యార్థులకు కూడా ప్యాంట్లను అందించనున్నారు. ప్రస్తుతం నెక్కర్లకు సంబంధించిన వస్త్రం మాత్రమే జిల్లాకు చేరుకుంది. మొత్తం 2.30లక్షల మీటర్ల వస్త్రం అవసరం కానుండగా ప్రస్తుతం 60,167 మీటర్ల వస్త్రం జిల్లాకు వచ్చింది. ఈ విద్యా సంవత్సరానికి ఒక జత యూనిఫాంను జూన్ మొదటి వారంలో అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
జాప్యం లేకుండా..
జిల్లాలో 730 పాఠశాలలున్నాయి. వీటిలో 484 ప్రాథమిక, 68 ప్రాథమికోన్నత, 163 జిల్లా ఉన్నత, జిల్లా పరిషత్ పాఠశాలలతోపాటు టీయూడబ్ల్యూఎస్, కేఈబీవీ, యూఆర్‌ఎస్, ఆదర్శ, టీజీఆర్‌ఈఎస్ పాఠశాలల్లో సుమారు 55 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతిఏటా రెండు జతల యూనిఫాం అందజేస్తోంది. గతంలో కుట్టే బాధ్యతను ఏజెన్సీలకు ఇవ్వడంతో జాప్యం చేసేవారు. దీంతో గత ఏడాది మహిళా సంఘాలకు అప్పగించగా సమర్థవంతంగా నిర్వహించారు. తర్వాత రెండో జత ఎస్‌ఎస్‌జీ గ్రూపులకు ఇచ్చారు. దుస్తులను త్వరగా కుట్టి ఇవ్వడంతో పాటు వారికి ఆర్థికంగా దోహదపడింది. ఇదివరకు జతకు రూ.50లు ఇచ్చారు. గతేడాది నుంచి ఒక్కో జతకు రూ.75లు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 40వేల మంది విద్యార్థుల యూనిఫాం కుట్టినందుకుగాను ఇంకా రూ.20లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులు డీఆర్‌డీఏ ఖాతాల్లో ఉండగా.. మహిళలకు చేరాల్సి ఉంది.
విద్యార్థుల కొలతల ప్రకారం
గతంలో విద్యార్థులకు కొలతలు లేకుండా యూనిఫాం కుట్టేవారు. దీనివల్ల కొందరికి వదులుగా మరికొందరికి బిగుసుగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఈ సారి పాఠశాలల వారీగా కొలతలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో విద్యార్థుల కొలతలు తీసుకునే ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది.
ఫ ఈ విద్యాసంవత్సరానికి
సంబంధించి జిల్లాకు వచ్చిన
60,167 మీటర్ల వస్త్రం
ఫ విద్యార్థులకు జూన్ మొదటి వారంలో యూనిఫాం అందించేందుకు ఏర్పాట్లు
ఫ ఈసారి 6, 7వ తరగతుల
విద్యార్థులకు కూడా ప్యాంట్లు


