మలేరియా రహిత జిల్లాగా మారుద్దాం
భువనగిరి : మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్ సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2030 నాటికి మలేరియాను నిర్మూలించడమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిందన్నారు.ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి జ్వర బాధితులను గుర్తించి మందులు అందజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా ప్రోగ్రాం అధికారి సాయిశోభ, ప్రోగాం అధికారులు డాక్టర్ శిల్పిని, వీణ, సుమన్ కళ్యాణ్, మాస్ మీడియా జిల్లా అంజయ్య, మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


