
గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్ మృతి
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ నజీరొద్దీన్(56) గుండెపోటుతో మృతిచెందారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన తర్వాత ఆయనకు అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో ఇంట్లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు. సూర్యాపేట జిల్లా భీమారం గ్రామానికి చెందిన నజీరొద్దీన్ 1995లో కాని స్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. ఆయన కుటుంబంతో కలిసి మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్‌లో నివాసముంటున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన కుమారుడు తిరిగొచ్చిన తర్వాత నజీరొద్దీన్ అంత్యక్రియలు పోలీసు లాంఛనాల మధ్య నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు తెలిపారు. నజీరొద్దీన్ భౌతికకాయానికి మిర్యాలగూడ వన్‌టౌన్ సీఐ నాగభూషణం, టూటౌన్ సీఐ సోమనర్సయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీనివాస్, పోలీస్ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, హోంగార్డుల సంఘం జిల్లా నాయకుడు కోడిరెక్క కిరణ్‌కుమార్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది నివాళులర్పించారు.