
రైలు ఢీకొని వృద్ధుడి దుర్మరణం
మిర్యాలగూడ అర్బన్: రైలు ఢీకొని వృద్ధుడు మృతిచెందిన ఘటన మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం మెల్కపట్నం గ్రామానికి చెందిన నామిరెడ్డి అనంతరెడ్డి(77) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం శనివారం తమిళనాడు రాజధాని చైన్నెకి వెళ్లి తిరిగి సోమవారం తెల్లవారుజామున రైలులో మిర్యాలగూడకు చేరుకున్నాడు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ రెండో ప్లాట్‌ఫాంపై దిగిన అనంతరెడ్డి ట్రాక్ దాటుతుండగా.. నడికుడి వైపు వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
మహిళ అదృశ్యం
నాగారం: కుమార్తె ఇంటికి వచ్చిన మహిళ అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన బోడ పున్నమ్మ ఈ నెల 1న నాగారం మండలం మామిడిపల్లిలో తన కుమార్తె పేరాల మమత ఇంటికి వచ్చింది. తిరిగి అదే రోజు సాయంత్రం సూర్యాపేటకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో పున్నమ్మ కుమార్తె మమత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం. ఐలయ్య తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 87126 86039, 81432 62997 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.