
విద్యుదాఘాతంతో మహిళ మృతి
రాజాపేట : విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందిన ఘటన రాజాపేట మండల కేంద్రంలో శనివారం ఉదయం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామానికి చెందిన సంపంగి చినతిరుపతయ్య తన భార్య ఆండాలు(40), కుమారుడు అంజితో కలిసి బతుకుదెరువు కోసం 15 రోజుల క్రితం రాజాపేట మండల కేంద్రానికి వలస వచ్చాడు. కుమ్మరికుంట వద్ద కాకాల్ల మల్లయ్య భూమిలో గుడిసె వేసుకుని నివసిస్తూ.. బండ కొట్టి కూలి పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. శనివారం ఉదయం నీళ్లు తెచ్చేందుకు ఆండాలు పక్కనే ఉన్న గొళ్లెన రాములు ఇంటికి వెళ్లింది. తలపై నీటికుండతో తిరిగి వస్తుండగా అడ్డుగా ఉన్న తీగను పైకి లేపింది. ఆ తీగకు కరెంట్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయింది. ఆమెను రాజాపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త తిరుపతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు.
జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శనివారం వాహనాల రద్దీ నెలకొంది. విద్యాసంస్థలకు దసరా పండుగ సెలవులు ఇవ్వడంతో హైదరాబాద్ వాసులు స్వగ్రామాలకు వెళ్తుండడంతో ఈ రద్దీ ఏర్పడింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈ రద్దీ కొనసాగింది. వాహనాలు నిదానంగా ముందుకు సాగాయి. సివిల్, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు శ్రమించారు. చౌటుప్పల్ పట్టణంలోని జంక్షన్‌ల వద్ద రోడ్డు దాటేందుకు స్థానిక వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
16 గేట్ల ద్వారా పులిచింతల నీటి విడుదల
మేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు టెయిల్‌పాండ్, మూసీ నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి వరకు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు 4,16,720 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 16 గేట్లను ఎత్తి 4,63,136 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. టీజీ జెన్‌కో 16,600 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.