
సాంకేతిక కోర్సులతో ఉద్యోగావకాశాలు
నల్లగొండ: సాంకేతిక కోర్సుల్లో శిక్షణ పొందడం ద్వారా మంచి ఉద్యోగావకాశాలు పొందవచ్చని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఐటీఐ ప్రాంగణంలో రూ.42.5 కోట్లతో నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.2400కోట్లతో 65 ఏటీసీలను వర్చువల్‌గా ముఖ్యమంత్రి ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఏటీసీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే మరోవైపు ప్రైవేట్ సెక్టార్‌లో కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. యువత కష్టపడి చదివి ఉద్యోగాలను సాధించాలన్నారు. పక్కనే ఉన్న న్యాక్ భవనంలో కూడా మహిళలకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. యువత భవిష్యత్ వారి కష్టం మీదే ఆధారపడి ఉంటుందన్నారు. 4 సంవత్సరాలు కష్టపడి చదివితే 40 ఏళ్లు సుఖంగా ఉండవచ్చని అన్నారు. అనంతరం జిల్లా అవార్డు సాధించిన కలెక్టర్ ఇలా త్రిపాఠిని మంత్రి అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఒకేషనల్ శిక్షణ ఉంటే ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. డిగ్రీ, ఇతర చదువుల ద్వారా మాత్రమే కాకుండా సాంకేతిక విద్య ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఏటీసీలో శిక్షణ పొందిన వారికి భవిష్యత్తులో పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెలిక్లంటి సత్యం, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, ఉపాధి కల్పన అధికారి ఎన్. పద్మ, ఏటీసీ ప్రిన్సిపాల్ నర్సింహచారి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఫ రోడ్లు, భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ నల్లగొండ పట్టణంలో అడ్వాన్స్
టెక్నాలజీ సెంటర్ ప్రారంభం