పథకం ప్రకారమే హత్య | - | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే హత్య

Sep 28 2025 8:16 AM | Updated on Sep 28 2025 8:16 AM

పథకం ప్రకారమే హత్య

పథకం ప్రకారమే హత్య

సూర్యాపేటటౌన్‌: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కేసారం రోడ్డులో శుక్రవారం రాత్రి హత్యకు గురైన వ్యక్తిని పథకం ప్రకారమే ప్రత్యర్థులు మట్టుబెట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ హత్యలో పాల్గొన్న వారితో పాటు మృతుడు సైతం పాత నేరస్తుడే కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన చారగండ్ల శివకుమార్‌(29)కి ఐదేళ్ల క్రితం పెద్ది లింగస్వామి అనే వ్యక్తితో గొడవ జరిగింది. అప్పట్లో లింగస్వామి శివకుమార్‌పై హత్యాయత్నం చేయగా కేసు నమోదైంది. అప్పటి నుంచి లింగస్వామి శివకుమార్‌పై పగ పెంచుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పూల సెంటర్‌లో ఇద్దరి మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో ఎలాగైనా శివకుమార్‌ను హతమార్చాలని లింగస్వామి నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రౌడీషీటర్‌ మాతంగి మధుతో శివకుమార్‌కు ఫోన్‌ చేయించి భీమారం రోడ్డులోని కుసుమవారిగూడెం సమీపంలోని మద్యం దుకాణం వద్దకు పిలిపించాడు. అయితే మాతంగి మధు, శివకుమార్‌ కలిసి గతంలో చిన్న చిన్న పంచాయితీలు, సెటిల్‌మెంట్లు చేసేవారు. ఏడాది క్రితం మాతంగి మధు కోదాడకు చెందిన ఓ వ్యక్తి హత్యకు సుపారీ తీసుకున్నట్లు తేలడంతో పట్టణ పోలీసులు అతడిని బైండోవర్‌ చేశారు. తాను సుపారీ తీసుకున్న విషయం శివకుమార్‌ పోలీసులకు చెప్పాడని మధు సైతం అతడిపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో వీరంతా కలిసి కుసుమవారిగూడెం సమీపంలో ఉన్న వైన్స్‌ ఎదురుగా ఉన్న హోటల్‌లో శుక్రవారం రాత్రి మద్యం తాగుతుండగా మాతంగి మధు, పెద్ది లింగస్వామి మరికొంత మంది కలిసి గొడ్డళ్లు, కత్తులతో శివకుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చి పరారయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాతంగి మధుపై కూసుమంచిలో ఒక హత్య కేసు, సూర్యాపేటలో మూడు హత్యాయత్నం కేసులు, సూర్యాపేటలో మూడు, కేతేపల్లిలో ఒక చోరీ కేసు నమోదై ఉంది. మృతుడికి భార్య అఖిల, కుమారుడు రిష్‌, కుమార్తె విజయశ్రీ ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట రూరల్‌ పోలీసులు తెలిపారు.

ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

హత్య జరిగిన స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ శనివారం పరిశీలించారు. డీఎస్పీ, సీఐలతో పాటు స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నిందితులను త్వరగా అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. నిందితులను పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్‌, సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామారావు, రూరల్‌ సీఐ బాలునాయక్‌ ఉన్నారు.

పాత కక్షలతోనే శివకుమార్‌ను హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement