
అలైన్‌మెంట్ మారుస్తామనే హామీని నిలబెట్టుకోవాలి
భువనగిరిటౌన్ : తాము అధికారంలోకి వస్తే రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మారుస్తామని భువనగిరి, మునుగోడు, ఆలేరు ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు చేసిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ముందు ప్రకటించిన అలైన్‌మెంట్ కాకుండా.. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 28కి.మీ. దూరానికే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని కుదించడం వలన పట్టణ, మండల కేంద్రాలకు చేరువలో ఉన్న సారవంతమైన భూములను రైతులు అత్యధికంగా కోల్పోతున్నారని అన్నారు. సాగుకు యోగ్యంకాని భూములను తీసుకోవాలని చట్టం చెబుతున్నా.. కొందరు పారిశ్రామికవేత్తలు. రాజకీయ నాయకులు, సంపన్న వర్గాలను కాపాడేందుకు అలైన్‌మెంట్‌ను మార్చి రైతాంగానికి నష్టం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వందల కుటుంబాలు భూమిలేని నిరుపేదలుగా మారే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో రీజినల్ రింగ్ రోడ్డు అంశాన్ని తమకు అనుకూలంగా వాడుకొని, ఇప్పడు అధికారంలోకి రాగానే రైతులకు మొండిచేయి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అనేకసార్లు ఇచ్చిన హామీ మేరకు భువనగిరి, మునుగోడు, ఆలేరు ఎమ్మెల్యేలు రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్పు చేయించి మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసచారి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, నాయకులు దొంతగాని పెద్దులు, గంగదేవి సైదులు, మాయ కృష్ణ, దయ్యాల నరసింహ, గడ్డం వెంకటేష్, పల్లెర్ల అంజయ్య, ఈర్లపల్లి ముత్యాలు, గంటపాక శివ తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జహంగీర్
ఫ రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులతో కలిసి యాదాద్రి కలెక్టరేట్ ఎదుట ధర్నా