పోరాటానికి సిద్ధమవుతున్న నేతన్నలు | - | Sakshi
Sakshi News home page

పోరాటానికి సిద్ధమవుతున్న నేతన్నలు

Nov 20 2025 7:08 AM | Updated on Nov 20 2025 7:08 AM

పోరాటానికి సిద్ధమవుతున్న నేతన్నలు

పోరాటానికి సిద్ధమవుతున్న నేతన్నలు

నేడు హైదరాబాద్‌లో మహాధర్నా

భూదాన్‌పోచంపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చేనేత కార్మికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని హ్యాండ్లూమ్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలో 9421 మగ్గాలపై ఆధారపడి 25 వేల మంది, 12,440 పవర్‌లూమ్‌ మగ్గాలపై ఆధారపడి 6వేల మంది చేనేత కార్మికులు జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన చేనేత సహకార సంఘాలలో సుమారు రూ.30కోట్ల మేర వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. టెస్కో అరకొరగా వస్త్రాలను కొనుగోలు చేసినా వెంటనే బిల్లులు చెల్లించడం లేదు. ఇక మాస్టర్‌ వీవర్స్‌, వస్త్ర వ్యాపారుల వద్ద మరో రూ.80 కోట్ల మేర సరుకు నిల్వ ఉంది. కొనుగోళ్లు మందగించి మార్కెట్‌ లేక చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించలేకపోతున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..

● గతేడాది సెప్టెంబర్‌ 9న చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రూ.30కోట్ల నిధులు సైతం మంజూరు చేశారు. కానీ నేటికీ రుణమాఫీ అమలుకాలేదు. ఉమ్మడి జిల్లాలో 2803 మందికి రూ.23.25కోట్ల రుణమాఫీ కావాల్సి ఉంది. చేనేత రుణమాఫీ చేయాలని కోరుతున్నారు.

● చేనేత కార్మికుల ఆర్థిక భరోసా కోసం త్రిఫ్ట్‌ పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తోంది. చేనేత కార్మికులు తమ వృత్తి ద్వారా వచ్చే ఆదాయం నుంచి 8శాతం బ్యాంకులో జమ చేస్తే, ప్రభుత్వం తమ వాటా కింద రెండింతలు ఖాతాలో జమ చేయా లి. కానీ 6 నెలలుగా ప్రభుత్వం తమ వాటా జమ చేయడంలేదు. ఒక్క యాదాద్రి జిల్లాలోనే 10,790 మందికి రూ.13.2 కోట్లు జమ చేయాల్సి ఉంది. త్రిఫ్ట్‌ పథకంలో భాగంగా ప్రభుత్వ డబ్బులు వెంటనే ఖాతాల్లో వేయాలని కోరుతున్నారు.

● గత ప్రభుత్వం నూలుపై 40శాతం సబ్సిడీ ఇచ్చేది. కాంగ్రెస్‌ ప్రభుత్వం నూలు సబ్సిడీని ఎత్తివేసి, నేతన్న భరోసా పథకం కింద నేరుగా మగ్గం నేసే కార్మికుడికి ఏడాదిలో రెండు విడతల్లో కలిపి రూ.18వేలు, అనుబంధ కార్మికుడికి రూ.6వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పింది. ఈ పథకం అమలుకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.44 కోట్లు కేటాయించింది. మొదటి విడతలో భాగంగా సెప్టెంబర్‌లో ఉమ్మడి జిల్లాలో జియో ట్యాగింగ్‌ కల్గిన 9421 మంది మగ్గం నేసే కార్మికులతో పాటు అనుబంధ కార్మికులకు రూ.11.31 కోట్లు జమ చేయాల్సి ఉన్నా అదీ అమలుకాలేదు.

● చేనేత సహకార సంఘాలకు చివరగా 2013లో ఎన్నికలు జరగగా.. పాలకవర్గాల పదవీకాలం 2018లో ముగిసింది. ఏడేళ్లుగా ఎన్నికలు నిర్వహించక పర్సన్‌ ఇన్‌చార్జిలచే సంఘాలను నిర్వహిస్తుండటంతో సంఘాలు నిర్వీర్యమయ్యాయి. ఆయా సంఘాలలో కోట్ల రూపాయల వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చేనేత కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 79 చేనేత సంఘాలలో 18,882 మంది, 5 పవర్‌లూమ్‌ సంఘాలలో 6588 మంది సభ్యులు ఉన్నారు.

● కేంద్ర ప్రభుత్వం 2017లో చేనేతపై 5శాతం జీఎస్టీ విధించింది. ఇటీవల మోదీ ప్రభుత్వం అనేక వస్తువులపై జీఎస్టీని తగ్గించినా.. చేనేతపై మాత్రం జీఎస్టీని రద్దు చేయలేదు. ఫలితంగా పెరుగుతున్న నూలు, ముడిసరుకు ధరలతో చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర లభించడంలేదు.

● పేటెంట్‌ హక్కు(జీఐ) గుర్తింపు ఉన్న పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాల డిజైన్లు మిల్లుల్లో ప్రింటింగ్‌ అవుతున్నాయి. డుప్లికేషన్‌ను అరికట్టాలని ధర్నాలు చేసినా, ఉన్నతాధికారులకు నేరుగా ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం శూన్యం.

●గత ప్రభుత్వాల హయాంలో ఉన్న బున్‌కర్‌ బీమా యోజన, హౌజ్‌ కం వర్క్‌ షెడ్‌ పథకాన్ని అమలు చేయాలి.

● వర్క్‌ టు ఓనర్‌ పథకాన్ని వెంటనే పూర్తిచేసి పవర్‌లూమ్‌ కార్మికులకు అందించాలి. అలాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించాలి.

ఫ చేనేత కార్మికుల దరిచేరని పథకాలు

ఫ ప్రభుత్వం ఇచ్చిన హామీలను

నిలబెట్టుకోవాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement