గంజాయి కేసులో ఆరుగురు నిందితుల అరెస్టు
కడప అర్బన్ : కడప నగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాసాపేట దొరల గోరీల సమీపంలో ఆదివారం ఆరుగురు వ్యక్తులు గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉండగా అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. వారి వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆదివారం కడపలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు టూటౌన్ సీఐ బి.నాగార్జున, ఎస్‌ఐలు ఎస్‌కేఎం హుసేన్, సిద్దయ్యలు తమ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారన్నారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అరెస్టయిన వారిలో నల్ల వినోద్, జనితి నవనీష్ కుమార్, షేక్ ఖాదర్, మూడే పవన్ కుమార్ నాయక్, షేక్ సమీర్, గోదాన సుధీర్ ఉన్నట్లు తెలిపారు. పిల్లలు చెడువ్యసనాలకు బానిసలు కావడానికి తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమన్నారు. కాగా, నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన కడప టూటౌన్ సీఐ నాగార్జున, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్‌కుమార్ అభినందించారు.
1200 గ్రాముల గంజాయి స్వాధీనం


