ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు టీడీపీ కౌన్సిలర్ మురళీధర్‌రెడ్డిపై రూరల్ పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇదే కేసులో మరో ముగ్గురిపై కూడా పోక్సో కేసు నమోదైంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆర్టీపీపీకి చెందిన మైనర్ బాలుడు ప్రొద్దుటూరులోని పూజా ఇంటర్నేషనల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. అతను ఐదుగురు అమ్మాయిల ఇన్‌స్ట్రాగామ్ ఐడీలను హ్యాక్ చేసి 9, 10వ తరగతి అబ్బాయిలకు అమ్మాయిల వ్యక్తిగత మొబైల్ నంబర్లను పంపించేవాడు. ఆడ పిల్లల ఫొటోలతో కొన్ని కొత్త ఇన్‌స్ట్రాగామ్ ఐడీలను తయారు చేసి అదే పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలకు మెసేజ్‌లు చేస్తూ తనను ప్రేమించాలని, లేదంటే వారి మొబైల్ నంబర్లను మగపిల్లలకు ఇస్తానని బెదిరించేవాడు. ఇలా 32 ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి ప్రేమించకుంటే వీడియోలు, ఫొటోలను అందరికీ పంపిస్తానని అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఇలా అతను అమ్మాయిలను ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు కొందరు తల్లిదండ్రులు తెలియచేశారు. అయితే బాలుడి తల్లిదండ్రులు అతన్ని దండించలేదు. బాలుడికి అడిగినంత డబ్బులిస్తూ అమ్మాయిలను బెదిరించమని ప్రోత్సహించేవారు.
తమ అబ్బాయి తప్పులు బయటపడతాయేమోనని.
తమ అబ్బాయి తప్పులు ఎక్కడ బయటపడతాయోననే భయంతో బాలుడి తల్లి ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ కౌన్సిలర్ మురళి, కొందరు రౌడీలను పాఠశాలకు తీసుకువచ్చింది. తమ కుమారుడి విషయాలు బయటపెడితే స్కూల్‌లో అనాథ పిల్లలను చంపేస్తానని భయపెట్టారు. మైనర్ బాలుడి ప్రవర్తన వల్ల 10వ తరగతి అమ్మాయిలు ఆత్మహత్య చేసుకునేందుకు కూడా సిద్ధపడ్డారు. దయచేసి ఆడపిల్లలను కాపాడాలని బాలికల తల్లులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు ముఖ్య కారణమైన బాలుడి తల్లిదండ్రులు కొండమ్మ, మాధవరెడ్డిలతో పిల్లలకు ప్రాణహాని ఉందన్నారు. బాలికల తల్లుల ఫిర్యాదు మేరకు 78, 351 (2), రెడ్‌విత్ 3(5) బీఎన్‌ఎస్, సెక్షన్ 11 రెడ్‌విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద మైనర్ బాలుడితో పాటు తల్లిదండ్రులు మూలయ్య కొండమ్మ, మూలయ్య మాధవరెడ్డి, మురళీపై బుధవారం కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.


