● చంద్రకాంతిలో కలువ సోయగం
సాధారణంగా సూర్యకాంతిలో వికసించే అనేక పువ్వులు మనకు తెలుసు, రాత్రిపూట వికసించే కొన్ని పువ్వులు కూడా ఉన్నాయి. వింతలు, విశేషాలకు ప్రకృతి నెలవు. సిద్దవటంలోని అటవీఽశాఖ కార్యాలయంలో రాత్రిపూట చంద్రకాంతిలో కలువపువ్వు వికసించి అందరినీ అబ్బురపరిచింది. సాధారణంగా కలువ పూలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు వికసిస్తాయి. కానీ ముదురు ఎరుపు లేదా గులాబీ లేదా ఊదా రంగులో ఉండే ఈ నీటి కలువ.. శనివారం సాయంత్రం సంధ్యా సమయంలో వికసించింది. నీటిలో తేలియాడే ఈ అందమైన ప్రకాశవంతమైన పువ్వు చీకటి నేపథ్యంలో చాలా మర్మంగా కనిపిస్తుంది. 6 నెలల కిందట 8 రకాల కలువ పువ్వులను వివిధ ప్రదేశాల నుంచి తెప్చించి కార్యాలయం ఆవరణంలో మూడు తొట్లలో నాటామని సిద్దవటం రేంజన్ కళావతి తెలిపారు. రాత్రి పూట వికసిస్తూ కనువిందు చేస్తోందని ఆమె చెప్పారు.
– సిద్దవటం
ధూమపాన డ్రైవర్‌పై సస్పెన్షన్ వేటు
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం క్షేమకరమని ప్రజలు భావించి, ఇష్టపడుతుంటారు. ఇటువంటి సందర్భంలో డ్రైవర్లు, కండెక్టర్లు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అయితే శనివారం తెల్లవారుజామున కడప నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో.. డ్రైవర్ ఎ.రామమోహన్ విధి నిర్వహణలో ప్రయాణికుల భద్రతను విస్మరించి ధూమపానం చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇలా చేయడం సరికాదని పలువురు ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ డ్రైవర్‌ను విజయవాడలో విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని కడప డిపో మేనేజర్ డిల్లీశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. బస్సును వేరే డ్రైవర్ సాయంతో కడపకు తీసుకొచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. భవిష్యత్తులో డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
– కడప కోటిరెడ్డిసర్కిల్
● చంద్రకాంతిలో కలువ సోయగం


