వైభవంగా బలిజపల్లె గంగమ్మ జాతరకు అంకురార్పణ
రాజంపేట టౌన్ : ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో బలిజపల్లె గంగమ్మ జాతర రెండో పెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచింది. ఏప్రిల్ 3వ తేదీ జరగనున్న గంగమ్మ జాతరకు ఆదివారం రాత్రి నిర్వాహకులు అంకురార్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అంకురార్పణ వేడుకను తిలకించేందుకు పట్టణ వాసులే కాక వివిధ గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో బలిజపల్లెలో స్వయంభుగా వెలసిన గంగమ్మ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది.
గంటకు పైగా పూజలు
గంగమ్మ జాతర అంకురార్పణ వేడుక సందర్భంగా నిర్వాహకులు గంగమ్మ స్వయంభుకు గంటకు పైగా పూజలు నిర్వహించారు. తొలుత అమ్మవారి స్వయంభును పుష్పాలతో అలంకరించారు. ఒకవైపు పూజా కార్యక్రమాలు జరుగుతుండగా, మరోవైపు తప్పెట్ల దరువులు, కొమ్ము ఊదడం, గంగమ్మ ఆవహించిన భక్తులు ఊగిపోవడం చూసి భక్తులు ఆనందపరవశులయ్యారు. జాతర అంకురార్పణకు ప్రధాన ఘట్టమైన పోతు మెడలో దండ పడగానే భక్తులు పెద్దఎత్తున చప్పట్లు చరించి, ఈలలు, కేకలు వేయడంతో బలిజపల్లె గ్రామం దద్దరిల్లింది. ప్రతి ఏడాది అంకురార్పణకు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. దీంతో తోపులాటలు జరిగేవి. అయితే ఏఎస్పీ మనోజ్ రామ్‌నాథ్ హెగ్డే చొరవ తీసుకోవడంతో ఈఏడాది తోపులాటలు వంటివి జరగకుండా అర్బన్ సీఐ రాజ, ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. గంగమ్మ స్వయంభు ప్రాంగణం చుట్టూ రోప్ ఏర్పాటు చేసి తోపులాటలకు చెక్ పెట్టారు.
వేలాదిగా తరలి వచ్చిన భక్తులు
వైభవంగా బలిజపల్లె గంగమ్మ జాతరకు అంకురార్పణ


