కూటమి ప్రభుత్వంలో దళిత, మైనార్టీలకు రక్షణ లేదు
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని దళిత ఫోరం జిల్లా చైర్మన్ కిషోర్ బూసిపాటి అన్నారు. ఆదివారం నగరంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందితే కేసు నమోదు విషయంలోనూ, పోస్టుమార్టం చేసే సమయంలోనూ పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అతన్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడంలో విఫలయ్యారన్నారు. దీన్నిబట్టే రాష్ట్రంలో క్రిష్టియన్ మైనార్టీలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా తిరిగే పరిస్థితి లేదని అర్థమవుతోందన్నారు. పగడాల ప్రవీణ్ తనకు ప్రాణహాని ఉందని చాలా రోజులుగా చెబుతున్నా ఆయనకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. హత్యపై అన్ని జిల్లాల్లో నిరసనలు వ్యక్తమవుతుంటే సీఎం చంద్రబాబుగానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌గానీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీకి స్తంభాలైన భజరంగ్‌దళ్, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ సిద్ధాంతాలు అమలవుతుండటం వల్ల మైనార్టీలు, క్రిష్టియన్లకు రక్షణ కరువవుతోందన్నారు. ప్రవీణ్ హత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అంబేడ్కర్ సేన రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు పెంచలయ్య పాల్గొన్నారు.


