● భూముల సంగతి తేల్చాలి
● ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిదిరెండు నాలుకల ధోరణి●
● ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
జమ్మలమడుగు : జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిలు దాల్మియా యాజమాన్యంతో ఎటువంటి ఒప్పందం చేశారో.. ప్రజలందరికీ బహిర్గతం చేస్తే బాగుంటుందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో చిన్న కొమెర్ల, నవాబుపేట, దుగ్గనపల్లి రైతులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దాల్మియా పరిశ్రమపై రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నారన్నారు. దాల్మియా ప్రజాభిప్రాయ సేకరణలో వారిని బయటపడేసే విధంగా వ్యవహరించారు. బయటికి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కారం చేయనిదే రెండో ప్లాంట్ ముందుకు పోదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జడ్జి ముందు సాక్ష్యం చెబితే బాధితులకు న్యాయం జరుగుతుందని.. అలా కాకుండా ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్ ముందు తప్పుడు సాక్ష్యం చెప్పి, బయటికి వచ్చి న్యాయం చేస్తామనడం రైతులను నట్టేట ముంచడమే అవుతుందన్నారు. దాల్మియా ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు తమ సమస్యలన్నీ వివరించారని తెలిపారు. అయినా జిల్లా కలెక్టర్ ముంపునకు గురి అయ్యే భూముల గురించి ఒక్కమాటకూడ చెప్పలేదన్నారు. దాదాపు 400 ఎకరాల భూమి మునకకు గురి అయితే ప్రస్తుతం ఆభూముల్లో సాగుచేయలేని స్థితి ఉందన్నారు. నిజంగా జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని ఉంటే దాల్మియా యాజమాన్యంతో భూములను కొనుగోలు చేసిన తర్వాతనే.. రెండో ప్లాంట్ ముందుకు వెళ్లాలని, విస్తరణ కోసం పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించాలన్నారు. శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి రైతులకు నిజంగా న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే కలెక్టర్‌కు తన లెటర్‌ప్యాడ్ పైన రైతుల సమస్యలు పరిష్కారం చేసిన తర్వాతనే విస్తరణ పనులు చేపట్టాలని పర్యావరణ శాఖకు నివేదిక ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న కొమెర్ల సర్పంచ్ జగదీశ్వరరెడ్డి, నవాబు పేట భాస్కర్‌రెడ్డి, హృషికేశవరెడ్డి, బడిగించల జనార్థాన్, గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


