ఈత కొమ్మలకు భలే గిరాకీ
పులివెందుల రూరల్ : వేసవి కాలంలో ఈత కొమ్మలకు భలే గిరాకీ ఏర్పడింది. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఈత కొమ్మలను కొనుగోలు చేసి వాటిని అరటి మొక్కలకు అండగా ఈత కొమ్మలను నాటుతారు. పులివెందుల ప్రాంతంలో అరటిని ఎక్కువ సాగు చేయడంవల్ల అరటి పిలకలు నాటినప్పుడు ఆ పిలకలు ఎండ వేడిమి నుంచి, వివిధ రకాల అడవి జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు ఈత కొమ్మలను రైతులు అరటి పిలకల పక్కనే నాటుతారు. హిందూపురం, పెనుగొండ, సత్యసాయి, అనంతపురం ప్రాంతాల నుంచి ఈత కొమ్మలను చెట్ల నుంచి కోసుకొని వచ్చి పులివెందుల ప్రాంతంలో ఒక్కో ఈత కొమ్మను రూ.5ల చొప్పున విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు.
గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా
సంబేపల్లె : చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారిపై సంబేపల్లె వద్ద మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా పడింది. కడప నుంచి సిలిండర్ ఫుల్ లోడుతో నిమ్మనపల్లెకు వెళుతున్న లారీ మండల కేంద్రంలోని వడ్డపల్లె క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైడర్ ఎక్కడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ శివకు గాయాలయ్యాయి.


