కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండటం సౌకర్యవంతం
ప్రొద్దుటూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండటం ప్రజలకు చాలా సౌకర్యవంతమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామ సచివాలయ నూతన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అనే అంశంతో సచివాలయం, రైతు సేవా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఒకే ప్రాంగణంలో నిర్మించాలన్న ఆలోచన చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అభినందిస్తున్నానన్నారు. సంపదను సృష్టించడం నాయకుడి ప్రధాన లక్షణమని, ఉన్న ఊరు సొంత ప్రాంతాన్ని చక్కపెడితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని 4వ స్థానంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 3,260 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మంజూరు చేసిందని, ఆగిపోయిన విలేజ్ హెల్త్ క్లినిక్‌లను పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్రలో భాగంగా ప్రజలు, దాతలు భాగస్వాములతో అట్టడుగున ఉన్న పేదలను అత్యున్నతంగా ఉన్న సంపన్నుల ద్వారా అభివృద్ధి చేయడం పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు నంద్యాల వరదరాజులరెడ్డి, ఆదినారాయణరెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగరాజు, ఆర్డీఓ సాయిశ్రీ, డీఎస్పీ భావన, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘశరెడ్డి, వీఎస్ ముక్తియార్, కొనిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, తహసీల్దార్ గంగయ్య, ఎంపీడీఓ సూర్యనారాయణరెడ్డి, మండల వ్యవసాయాధికారి శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్


