పది మూల్యాంకనానికి సర్వం సిద్ధం
● నేటి నుంచి ప్రారంభం.. 9వ తేదీ వరకు నిర్వాహణ
● ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు
● జిల్లాకు చేరిన సమాధాన పత్రాలు
● 1337 మంది సిబ్బందితో
మూల్యాంకనం
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీకి ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 161 పరీక్షా కేంద్రాలలో 28,700 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలను రాశారు. కాగా.. సమాధాన పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3వ తేదీ నుంచి కడపలోని మున్సిపల్ హైస్కూల్ మొయిన్‌లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పరీక్ష పేపర్లకు కోడింగ్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు అన్ని సబ్జెక్టులకు కోడింగ్ ముగియగానే చివరగా సోసియల్ సబ్జెక్టుకు కోడింగ్ జరుగుతోంది.
సిబ్బందికి వసతుల ఏర్పాటు...
మూల్యాంకనం చేసేందుకు జిల్లావ్యాప్తంగా 1337 మంది సిబ్బందిని విధులకు ఏర్పాటు చేశారు. ఇందులో ఛీప్ ఎగ్జామినర్లు 121 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 732 మందిని, స్పెషల్ అసిసెంట్లుగా 484 మందిని ఇలా మొ త్తంగా 1337 మందిని నియమించారు. విధులకు హాజరయ్యే సిబ్బందికి అన్ని రకాల మౌలిక వసతులను ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాటు చేసింది.
పక్కాగా నిబంధనలు అమలు: మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేశారు. ఈ కార్డు ఉన్న వారినే ఆ ప్రాంతంలోకి అనుమతించనున్నారు. మూల్యాంకనం జరుగుతున్న అన్ని రోజులు అటువైపు ఇతరులు రాకుండా ఆంక్షలు విధిస్తున్నారు.
● విడతల వారిగా..
ఈ ఏడాది వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,72,172 జవాబు పత్రాలను ఇక్కడ మూల్యాంకనం చేయనున్నారు. ఇందుకోసం 1,337 మంది సబ్జెక్టు టీచర్లను విద్యాశాఖ నియమించింది. ఈ మూల్యాంకన కేంద్రంలో జిల్లా విద్యా శాఖ అధికారి క్యాంపు ఆఫీసర్‌గా, డిప్యూటీ ఈఓ రాజగోపాల్‌రెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్‌లు డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లుగా, మరో ఏడు మంది అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. వీటితోపాటు ప్రతి గ్రూపునకు ఒక ఛీప్ ఎగ్జామినర్ (సీఈఓలు), ఆరుగురు సహాయ ఎగ్జామినర్లు (ఏఈలు), ఇద్దరు స్పెషల్ అసిసెంట్లు (ఎస్పీఏ) పాల్గొంటారు. ప్రతి సహాయక ఎగ్జామినర్ రోజుకు 40 పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది.


