జిల్లా ఆస్పత్రిని పరిశీలించిన కాయకల్ప బృందం
ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ఆస్పత్రిని కాయకల్ప పర్యవేక్షణ బృందం గురువారం పరిశీలించింది. జాయింట్ డైరెక్టర్ సాగర్, స్టేట్ టీబీ కార్యాలయ అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ రవీంద్రకుమార్ ఆస్పత్రిని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల పనితీరును బట్టి కాయకల్ప అవార్డును ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా అధికారుల బృందం ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని వార్డులతో పాటు, ఓపీ విభాగాలను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. అలాగే పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్‌బాబు కాయకల్ప బృందానికి ఆస్పత్రిలో అందిస్తున్న సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డాక్టర్ రూపానంద్, డాక్టర్ గోపాల్ పాల్గొన్నారు.


