విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
బద్వేలు అర్బన్ : ఇటీవల పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మరువకముందే.. అటువంటి సంఘటన మరొకటి పునరావృత్తమైంది. పట్టణంలోని సుందరయ్యకాలనీ సమీపంలో గల ఏవీఆర్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై.. అదే పాఠశాలలో కంప్యూటర్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పెంచలయ్య అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధిత విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారితోపాటు బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. బద్వేలు పట్టణంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని త్యాగరాజకాలనీకి చెందిన ఓ విద్యార్థిని సుందరయ్యకాలనీ సమీపంలోని ఏవీఆర్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో గోపవరం మండలం అడుసువారిపల్లె గ్రామానికి చెందిన పెంచలయ్య కంప్యూటర్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే కొంత కాలంగా పెంచలయ్య బాధిత విద్యార్థినితోపాటు మరికొంత మంది విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో త్యాగరాజకాలనీకి చెందిన విద్యార్థిని.. ఉపాధ్యాయుడి ఆగడాలను తట్టుకోలేక శుక్రవారం తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులతోపాటు బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఇంతలో విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని స్టేషన్‌కు తరలించారు. అనంతరం విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు పెంచలయ్యపై అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల కాలంలో ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థినులపై జరుగుతున్న వరుస ఘటనలతో తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాగే విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ఇలా అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు, బంధువులు
స్టేషన్‌కు తరలించిన పోలీసులు
బద్వేలులోని ఏవీఆర్ స్కూల్‌లో ఘటన


