ప్రజలను రెచ్చగొట్టి పంపిస్తున్నారు
కడప అర్బన్ : అధికార పార్టీ నాయకులు అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టి డబ్బులిచ్చి ఇళ్లపైకి పంపిస్తున్నారని, ఇది విష సంస్కృతికి నాంది పలుకుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ.అంజద్‌బాషా, నగర మేయర్ సురేష్‌బాబు, ఇతర వైఎస్సార్ సీపీ నేతలు తెలిపారు. కడప ఎస్పీ బంగ్లాలో శనివారం రాత్రి జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్‌ను వారుకలిసి వినతిపత్రం అందజేశారు. అంజద్‌బాష మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇబ్రహీంమియా చెన్నూరు బస్టాండు వద్ద వ్యాపారం చేసుకుంటుండగా, కొందరు మహిళలు వారి అనుచరులతో వచ్చి విచక్షణారహితంగా కొట్టి నీ అంతుచూస్తామంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లారన్నారు. ఇబ్రహీంమియా తనకు జరిగిన అన్యాయంపై వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారని, అక్కడి పోలీసులు మియా ఇచ్చిన ఫిర్యాదు తీసుకోలేదన్నారు. మియా తనకు ఫోన్ ద్వారా తెలుపగా వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి సీఐ రామకృష్ణతో మాట్లాడానన్నారు. ఇబ్రహీం మియాకు తగిలిన గాయాలు చూపించి కేసు కట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ నెల 4న సాయంత్రం 5 గంటలకు అశోక లాడ్జి వద్ద తన ఇంటి నివాస స్థలానికి కొంతమంది మహిళలు వారి అనుచరులు, కొంతమంది మీడియాతో వచ్చి తన చిత్రపటాన్ని ఫ్లెక్సీలను ముద్రించి ఆందోళన చేశారన్నారు. సాధారణంగా తన దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు తాను ముందుంటానని, అందులో భాగంగానే శుక్రవారం స్టేషన్‌కు వెళ్లి వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇబ్రహీం మియాను పరామర్శించడం జరిగిందన్నారు. గతంలో మేయర్ సురేష్‌బాబు ఇంటి ఎదుట చెత్త వేయించి నినదిస్తూ కూర్చొన్నారన్నారు. ఇవన్నీ చూస్తుంటే కడపలో ఒక కొత్త సంప్రదాయానికి తెరలేపారన్నారు. తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా, సురేష్‌బాబు జెడ్పీ చైర్మన్‌గా, రెండు సార్లు నగర మేయర్‌గా, నాలుగుసార్లు జిల్లా అధ్యక్షులుగా పనిచేశామని, తమకే భద్రత లేకపోతే కార్యకర్తలు, సాధారణ ప్రజలకు ఏం భద్రత ఉంటుందో ఆలోచించాలన్నారు. ఈ సంఘటనలపై విచారణ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పులిసునీల్‌కుమార్, ఎస్‌ఎండీ.షఫీ, దాసరి శివప్రసాద్, దేవిరెడ్డి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీకి వైఎస్సార్‌సీపీ నేతల వినతి


