వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చామంటూ టీడీపీ దుష్ప్రచారం
కడప సెవెన్‌రోడ్స్: వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ మద్దతు ఇచ్చిందంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారానికి దిగడం వారి నీచ సంస్కృతిని బట్టబయలు చేస్తోందని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ.అంజద్‌బాషా ధ్వజమెత్తారు. కడపలో మీడియాతో శనివారం ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మీడియా వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారానికి పాల్పడుతోందని మండిపడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభలో వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ రాజ్యసభలో మద్దలిచ్చిందంటూ టీడీపీ నేతలు నక్కాఆనంద్‌బాబు, నాగుల్ మీరాలు చెప్పడంలో ఎలాంటి నిజం లేదన్నారు. తమ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాటకు కట్టుబడే ఉంటారని, లోక్‌సభలో తమ పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్‌రెడ్డి బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజ్యసభలో తమ పార్టీ ఫ్లోర్ లీడర్ వైవీ.సుబ్బారెడ్డి బిల్లును వ్యతిరేకిస్తూ సుమారు పది నిమిషాలు మాట్లాడారన్నారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులంతా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ వైవీ.సుబ్బారెడ్డి జారీ చేసిన విప్‌ను ఆయన ఈ సందర్భంగా ప్రదర్శించారన్నారు. విప్ జారీలో ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ టీడీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. బిల్లుకు అనుకూలంగా రాజ్యసభలో 125 ఓట్లు రాగా, వ్యతిరేకంగా వచ్చిన 95 ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్‌వే ఏడు ఉన్నాయన్నారు. ఈ విషయం నేషనల్ మీడియా తెలియజేసిందని, పవన్ కల్యాణ్ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్లు స్పష్టంగా చెప్పారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లింలపై ఈగ వాలనివ్వబోమని, వక్ఫ్ ఆస్తులకు నష్టం కలగదని, ముస్లింలకు అండగా ఉంటామని మాట్లాడి.. ఇప్పుడు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు.
● ఉభయ సభల్లో వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు ఓటేశారు
● లోకేష్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా ద్వారా బురదజల్లే యత్నం
● బిల్లులకు మద్దలిచ్చిన టీడీపీ మైనార్టీ ద్రోహిగా నిలిచిపోయింది
● రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా


