వల్లూరు : పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. ఊర్మిళాదేవి అన్నారు. మండల పరిధిలోని వల్లూరు గ్రామ పంచాయతీలో మంగళవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ఎస్‌డబ్ల్యూిపీసీ షెడ్డును పరిశీలించారు. అనంతరం గ్రామంలోని వీధుల్లో పర్యటించి ప్రజలతో స్వయంగా మాట్లాడారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలను, అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి, టాయిలెట్లను, ఇతర వసతులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ చొరవ చూపాలన్నారు. గ్రామాభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమన్నారు. వారు సమన్వయంతో పని చేసి గ్రామాన్ని ఆరోగ్యవంతంగా, పచ్చదనంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కన్సల్టెంట్ శివ నారాయణ, డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ సూర్య ప్రకాశ్ రెడ్డి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సందీప్, వల్లూరు, వీరపునాయునిపల్లె మండలాల ఎంపీడీఓలు రఘురాం, చంద్ర శేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, ఎంఆర్‌సీ నాగమణి, గ్రీన్ అంబాసిడర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


